దళిత ఆరాధ్యదైవం అంబేద్కర్‌ నేడు 121 జయంతి

0
దళిత ఆరాధ్యదైవం అంబేద్కర్‌ నేడు 121 జయంతి
భారతదేశంలోని కోటానుకోట్ల అట్టడుగు ప్రజల్ని సంఘటితపరచి, వారిలో రాజకీయ చైతన్యాన్ని రగిల్చి మట్టిబొమ్మలను మహారణానికి నడిపినట్లుగా అస్పశ్య ప్రజానికాన్ని పరిపూర్ణ దాస్య విముక్తి పోరాటం వైపు నడిపించి వారిని స్వతంత్ర భారత పౌరులుగా, న్యాయ నిర్ణేతలుగా, చట్టనిర్మాతలుగా, దేశ పరిపాలకులుగా చేసిన మహావ్యక్తి,... భారతరత్న బాబా సాహెబ్‌ డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌. స్వతంత్ర భారతదేశంలో నా ప్రజలు పాలకులుగానే వుంటారుగాని పాలితులుగా వుండజాలరనే ప్రతినబూని ఆ మహాదాశయ సాధనలో దాదాపు అర్థశతాబ్దంపాటు దీక్షతో నిర్విరామంగా కషిచేసి తరించిన అపూర్వ అద్వితీయ నాయకుడు అంబేద్కర్‌. అటువంటి మహనీయుని 121వ జన్మదిన వేడుకలు నేడు జరుగుతున్న సందర్భంగా ఆయన జీవిత విశేషాలు కొన్ని మీకోసం..
బాల్యం - విద్యాభ్యాసం ...
మహారాష్టల్రోని కొంకణీ ప్రాంతంలోగల రత్నగిరిజిల్లోవున్న అంబవాడ గ్రామంలో నాటి అంటరాని కులమైన మహర్‌కులస్థులు రామ్‌జీమాలలోజీ, భీమాబాయ్‌ ల 14వ సంతానంగా 1891 ఏప్రిల్‌ 14 తేదిన అంబేద్కర్‌ జన్మించాడు. తన ఐదవ యేట అక్షర పరిచయంకోసం ప్రాథమిక పాఠశాలలో అడుగిడిన ఆయనకు ఆ పసి వయసులోనే కులసర్పం తొలికాటువేసింది. ఇక ఆనాటినుండే వజ్రసంకల్పుడై తన జాతిని కుల సంకెళ్లనుండి విముక్తి చేయాలన్న తలంపుతో ఉన్నత చదువులే ముఖ్యమని భావించి ఆపరంగా అడుగులు వేశారు.

1912లో బొంబాయి ఎలిఫిన్స్‌టన్‌ కళాశాల నుండి బి.ఏ పాసై 1915లో ఎం.ఎ పట్టాను పొందడంతోపాటు భారతదేశంలో జాతీయాదాయం ఒక పరిశీలన అనే అంశంపై వ్రాసిన గ్రంథానికిగాను కొలంబియా విశ్వవిద్యాలయంవారు పి.హెచ్‌.డి డాక్టరేట్‌ పట్టాఇచ్చి గౌరవించారు. అమెరికా చదువులు పుర్తిచేసిన అంబేద్కర్‌ 1916లో లండన్‌ చేరుకొని చదువుసాగిస్తుందడగా బరోడ రాజు ఒప్పందం మేరకు చదువును మధ్యలో ఆపి బరోడ సంస్థానంలో ఆర్థికశాఖాధిపతిగా చేరారు. 1918లో సిడెన్‌హోమ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా చేరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే దళితులను చైతన్యపరిచేందుకు మూక్‌నాయక్‌ పత్రికను ప్రారంభించారు. ఆక్రమంలోనే 1923లో బొంబాయి హైకోర్టు నందు బారిష్టరుగా నమోదయ్యారు.

మహద్‌ చెరువు పోరాటంతో ఉద్యమాలు ప్రారంభం...
అన్ని కులాలు, మతాలవార చివరకు గేదలు, గాడిదలు సైతం కోటాబా జిల్లాలోని మహద్‌ చెరువులో నీటిని వినియోగించుకుంటుండగా తన జాతీయులకు ఎందుకు ఆ హక్కులేదంటూ 1927లో ప్రారంభమైన మహద్‌ పోరాటంతో దళితులనెందరినో చైతన్యపరిచారు. 1930లో నాసిక్‌ జిల్లా కాలారామ్‌ దేవాలయ ప్రవేశోద్యమం, 1931,1932 సంవత్సరములలో జరిగిన రౌండ్‌టెబుల్‌ సమావేశాలలో పాల్గొన్న అంబేద్కర్‌ ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా అణగద్రొక్కబడ్డ అస్పశ్యులను ఇతర వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగ, ప్రజాప్రాతినిధ్య వ్యవస్థలలో రిజర్వేషన్లు, రక్షణలు అవసరమని గళం విప్పారు. ప్రతేక నియోజకవర్గాలను గాంధీజీ వ్యతిరేకించి ఎర్రవాడ జైలులో సత్యాగ్రహం చేయగా తర్వాత అంబేద్కర్‌తో రాజీకుదిరి ఆనాటినుండి రిజర్వుడ్‌ నియోజకవర్గాలు వెలిశాయి. 1936లో ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీని స్థాపించిన ఆయన 1937లో జరిగిన ఎన్నికల్లో బొంబాయి రాష్ట్రంలోని పదిహేను రిజర్వుడు స్థానాలలో పద్నాలుగు స్థానాలతోపాటు ఒక జనరల్‌ స్థానాన్ని గెలుచుకున్నారు.

రాజ్యాంగా నిర్మాతగా...
1946లో రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడుగా అంబేద్కర్‌ ఎన్నికయ్యి రాత్రింబవళ్లు శ్రమించి యావత్‌ ప్రపంచ దేశాలలో అతిపెద్దదైన రాజ్యాంగ చట్టాన్ని రచించి పార్లమెంటులో ప్రవేశపెడుతూ ఇది యుద్దకాలంలోనూ, శాంతి కాలంలోనూ పనిచేస్తుందని ఒకవేళ ఈ రాజ్యాంగం విఫలమైతే అందుకు చట్టం కారణం కాదు మానవుడు కుచ్చితుడు కావడమే కారణమన్నారు. మంత్రివర్గంలో న్యాయశాఖామంత్రిగా పనిచేసినకాలంలో హిందూకోడ్‌ బిల్లు రూపొందించగా ఆమోదంలో చాందసవర్గాలు అడ్డుపడడంతో నిరాశపడిన అంబేద్కర్‌ పదవికి రాజీనామా చేసి బౌద్ధమతాన్ని స్వీకరించారు.

ఆయన నాయకత్వంలో జరిగిన ఉద్యమం మొత్తాన్ని పరిశీలిస్తే అంటరాని జాతి ప్రజలకు మానవహక్కుల కల్పన, అమానుషమైన కులవ్యవస్థని, అంటరానితనాన్ని నిర్మూలించుట, ప్రతి మనిషికి అన్ని రంగాల్లో ఒకే విలువ కల్పించుట పీడిత వర్గ ప్రజలను పరిపాలకులుగా మార్చుట, విద్యవైద్యం, ఉపాధి,భద్రత కల్పించుట, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతత్వం పునాదిగా సమాజాన్ని పునర్నిర్మించడం అంబేద్కర్‌ ప్రధాన లక్ష్యాలని చెప్పవచ్చు. అట్టడుగు ప్రజల అభ్యున్నతికి అహర్నిశలు కషి చేసిన డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ 1956 డిశంబర్‌ 6న మహానిర్యాణం చెంది, ఆయన వేసిన స్వేచ్ఛా పునాదులుపై జీవిస్తున్న అనగారినవర్గాల హదయాల్లో చిరస్థాయిగా నిలిచి వారి ఆరాధ్యదైవమయ్యాడు.