సందట్లో సడేమాయ

0

సందట్లో సడేమాయ
అవినీతిపై పోరులో అసందర్భ వ్యక్తులు
నిప్పులాంటి ఉద్యమంలోకీ తప్పుడు శక్తులు
అజాగ్రత్త చూపితే అసలుకే మోసం
వేదాలు రచిస్త్ను దెయ్యాలు
అవినీతిపై పోరాడేందుకు 'వీళ్లు సైతం'
ఎవరిపై ఎవరి పోరు? వీరిని నమ్మేదెవరు?
వీళ్లే కాదు; 'పక్కన పేర్కొన్నటువంటి నిప్పులాంటి, నికార్సైన, నీతికి ప్రాణమిచ్చే నిజాయితీ పరులు' అనేకమంది ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో 'అన్నా... నీ వెనక నేనున్నా' అంటూ హజారేకు మద్దతు ప్రకటించేశారు. 'నీతి మంతమైన భారత్ కోసం' 'అవినీతి వ్యతిరేక పోరాటంలో' సమిధలుగా మారడానికి స్వచ్ఛందంగా సిద్ధపడ్డారు! దేశంలో భారీ అవినీతికి అసలు కారణమైన నయా ఆర్థిక సంస్కరణలను, ముందూ వెనకా ఆలోచించకుండా ముందుకు తీసుకెళ్లిన వారు అవినీతికి వ్యతిరేకంగా పాదయాత్రలు చేశారు.

'ఓట్ల రాజకీయంలో సీట్లూ ముఖ్యమే'నంటూ అవినీతి పరులతో ఎన్నికల్లో అంటకాగిన వారు సంఘీభావ దీక్షలకు దిగారు. ఓట్లమ్ముకున్న వారు, సీట్లమ్ముకున్న వారు కూడా కొత్త పంథాలో కొవ్వొత్తులు చేబూని ఊరేగారు. మన రాష్ట్రంలో ప్రత్యేకంగా పేర్లు చెప్పనవసరం లేదు... ఇతర చోట్ల దేవెగౌడ, చౌతాలా, గోపీనాథ్‌ముండే, యడ్యూరప్ప ఇంకా ఎందరో 'నీతి మంతులు'.. హజారేకు మద్దతుగా రంగంలోకి దిగిపోయారు.

అద్భుతం! మరి వీరిలో చాలా మంది హజారే సమీపంలోకి సైతం ఎందుకు వెళ్లలేకపోయారు? 'లంచం ఇవ్వడం ఇష్టంలేకే దేశంలో మొట్టమొదటి ఎయిర్‌లైన్స్ ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకున్నాను' అని మొన్నటికి మొన్న ప్రకటించిన పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా, ఇప్పుడు ఎందుకు ముందుకు రావడానికి మొహమాట పడాల్సి వస్తోంది? అవినీతి వ్యతిరేక ఉద్యమంలోని అసందర్భాలపై 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక కథనం...

-ప్రఖ్యాత క్షేత్ర నగరిలో అక్రమాలకు పాల్పడిన ఓ వ్యక్తి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. స్వామి అగ్నివేశ్ సరసనే కూర్చుని, తాను ఎన్నడూ అవినీతికి పాల్పడలేదని ప్రకటించుకున్నారు. అవినీతి వ్యతిరేక పో రాటానికి 10 వేల చందానూ చదివించుకున్నారు.

- ఆంధ్రప్రదేశ్‌లో తండ్రి అధికారాన్ని ఆసరాగా చేసుకుని, లక్ష కోట్ల అవినీతికి పాల్పడిన ఓ యువ నేత, 'అన్నా హజారే డిమాండ్ల'కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

- కర్ణాటకలోను, మన రాష్ట్రంలోను వందల ఎకరాల గనులను కొల్లకొట్టిన ఓ నేత.. 'ప్రతి ఒక్కరూ అవినీతిపై పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది' అని పిలుపునిచ్చారు.

- బీహార్ రాష్ట్రంలో, హత్య కేసులో దోషిగా, జైలులో శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ ఒకరు, హజారే ఆమరణ దీక్షకు మద్దతుగా, తానూ జైల్లోనే నిరాహార దీక్ష చేపట్టారు.

- కంపెనీలు అక్రమాలకు పాల్పడకుండా ఉండటానికి కేంద్రం ప్రతిపాదించిన సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పారిశ్రామిక వేత్తలు 'హజారేకు' మద్దతు ప్రకటించారు.

హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సంఘీభావం ప్రకటించిన, మద్దతు తెలిపిన కొందరు నేతలను, పారిశ్రామిక వేత్తలను చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఇదేం విడ్డూరమని విస్మయ పడ్డారు. అయినా ఆయా ఘనులు అవేమీ పట్టించుకోకుండా తమదారిన తాము రంగంలోకి దిగిపోయారు. ఇంతకీ ఎవరు అవినీతి పరులు? ఎవరు ఎవరిపై పోరాడాలి?

'ప్రతి గొప్ప అదృష్టం వెనక ఓ 'పెద్ద నేరం' ఉంటుంది!' అనే వాక్యంతో ఇటలీ- అమెరికా రచయిత మారియో ఫ్యూజో రాసిన గాడ్‌ఫాదర్ నవల మొదలవుతుంది. సంస్కరణల భారతానికి దీన్ని అన్వయిస్తే, దేశంలో ప్రతి గొప్ప ప్రగతి వెనక ఓ 'భారీ అవినీతి' ఉంది అని మార్చుకోవచ్చు. గత రెండు దశాబ్దాల అభివృద్ధికి ప్రధాన ఇంధనం అవినీతే అంటే అతిశయోక్తి కాదు. కానీ సంస్కరణల యుగంలో అవినీతి వ్యవస్థాగతమై పోయింది.

"పేద ప్రజలకు వ్యతిరేకమైన ఆర్థిక సంస్కరణలకు, వ్యవస్థాగత మార్పులకు ప్రతిఘటన రాకుండా ఉండడం కోసం అవినీతిని ఇన్సెంటివ్‌గా చూపించారు. అడ్డగోలుగా సంపాదించుకోవడానికి అవకాశం కల్పించారు. ఫలితంగా వ్యవస్థకు బయట ఉండిన అవినీతి... సంస్కరణల యుగంలో వ్యవస్థలో భాగంగా (ఇన్‌బిల్ట్‌గా) మారిపోయింది. తర్వాత ఇంకాస్త ముందుకు వెళ్లి అవినీతి కోసమే వ్యవస్థలు (ప్రాజెక్టులు) రూపొందించే కొత్త సంస్కృతి వచ్చింది.

ఇలాంటి సంస్కృతిలో భాగమై, లబ్ధిపొందిన వారిలో పలువురు నాయకులు, నయా పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటంలో ముందుండటానికి ప్రయత్నించడం విశేషం. "మూడు తరాల నుంచి వ్యాపారాల్లో ఉన్న మాకన్నా, నిన్నా మొన్న వచ్చిన అతి మామూలు వాళ్లు, నాలుగైదేళ్లలోనే వందల కోట్లకు పగడలెత్తారు. ఇప్పుడు వాళ్లే అవినీతి వ్యతిరేక పోరాటానికి మద్దతుతో ముందు వరసలో నిలుస్తున్నారు.

దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో అంతుపట్టడం లేదు. అసలు వాళ్లు ఏరకమైన అవినీతి గురించి మాట్లాడుతున్నారు? మనం ఏరకమైన అవినీతిపై పోరాడాలి?'' అని వాపోయారు ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్. ఆది గోద్రెజ్, నారాయణమూర్తి వంటి వాళ్లదీ ఇదే అభిప్రాయం. సత్యంలాంటి కుంభకోణాలను నివారించడానికి కేంద్రం ఇటీవల కంపెనీల చట్టం సవరణ- 2010 బిల్లును రూపొందించింది. స్వతంత్ర డైరెక్టర్లను తప్పనిసరిగా నియమించుకోవాలని, ఆడిటర్లను తరచూ మార్చాలని ఇందులో నిబంధనలు పెట్టారు. తద్వారా కంపెనీల అక్రమాలకు, అడ్డుకట్ట వేయవచ్చన్నది ఉద్దేశం.


దేశంలోని మెజారిటీ పారిశ్రామిక, సంస్థలు ఈ రెండు నిబంధనలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాయి. వాటిని అంగీకరించే ప్రశ్నే లేదని కేంద్ర సర్కారుకు తేల్చి చెప్పాయి. అవే కంపెనీల సమాఖ్యలు, సీఐఐ, ఫిక్కీ వంటివి ఇప్పుడు హజారే అవినీతి పోరాటానికి మద్దతు ప్రకటించాయి.సెజ్‌ల పేరుతో అప్పనంగా రైతుల భూములు లాక్కుని, రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లకు పడగలెత్తిన వారు, మీడియాను అడ్డుపెట్టుకుని భూముల్లో పాగా వేసిన వారు సైతం అవినీతి వ్యతిరేక పోరాటానికి చాంపియన్లుగా అవతారమెత్తడం గమనార్హం.

"హజారేకు మేమూ మద్దతిస్తున్నామంటూ ముందుకొస్తున్న కొందరిని చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. జనాన్ని ఆకర్షిస్తున్న ఉద్యమంలో తమకూ కొంత ప్రచారం లభించాలనే తపన తప్ప అసలు నీతి గురించి మాట్లాడే నైతిక హక్కైనా తమకుందా అని వారు ఆలోచించకపోవడం విడ్డూరం'' ఓ సామాజిక ఉద్యమకారుడు వాపోయారు. అవినీతిపై పోరాడాలనడం, పోరాడతామనడం బాగానే ఉంది. కానీ, ఎవరు ఎవరిపై పోరాడతారు? ఎందుకంటే, పోరాడాల్సిన వ్యక్తులు, వ్యవస్థల్లో ఎక్కువభాగం ఆ అవినీతి లబ్ధిదారులే.

ఇద్దరూ కుమ్మక్కు
సంస్కరణల యుగం తెచ్చిన ప్రధాన మార్పు క్రోనీ క్యాపిటలిజం (ఉభయతారక పెట్టుబడిదారీ విధానం). అంటే ప్రభుత్వంలో ఉన్నవారు, వ్యాపారవేత్తలు కుమ్మక్కై, పరస్పర ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేయడం. అంటే ప్రభుత్వంలో ఉన్నవారు తమ చేతిలోని అధికారంతో పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అనుమతులు ఇస్తారు. పనులు చేస్తారు. అందుకు ప్రతిఫలంగా వారికి వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు.

ఈ క్రోనీ క్యాపిటలిజం విస్తృతికి, తత్ఫలితంగా పడగవిప్పిన అవినీతి విశ్వరూపానికి, తెరపైకి వచ్చిన నయా కోటీశ్వరులకు ఆంధ్రప్రదేశే ప్రత్యక్ష సాక్ష్యం. వేల కోట్ల కామన్‌వెల్త్, 2జీ కుంభకోణాలూ ఇందుకు నిదర్శనమే. ఇలాంటివాటిలో భాగస్వాములైన వారూ, క్షణాల్లో బిలియనీర్లుగా మారిపోయిన వారూ ఇప్పుడు అవినీతి వ్యతిరేక పోరాటం చేస్తామంటుండడం గమనార్హం. కానీ ఈ రాజకీయ నాయకులను నమ్మేదెవరు? అవినీతిపూరిత వ్యవస్థలో బతుకుతున్నప్పటికీ జనం అవినీతిని ఏవగించుకుంటున్నారు. సరైన వ్యక్తి వచ్చినప్పుడు... వెంట నిలుస్తున్నారు.

హజారేకు లభించిన మద్దతే అందుకు నిదర్శనం. అదే సమయంలో అవినీతికి ప్రధాన కారకులైన రాజకీయ నాయకులు మాత్రం ప్రజలను అర్థం చేసుకోలేక వెనకబడి పోతున్నారు. వారి ముందు మరుగుజ్జులుగా మిగులుతున్నారు. ఒకప్పుడు కొన్ని పార్టీలు మాత్రమే కొందరికి అంటరానివి. కానీ ఇప్పుడు మొత్తం రాజకీయ నాయకులే అంటరాని వారుగా మారిపోయారు. హజారే శిబిరానికి వెళ్లడానికి ప్రయత్నించిన చౌతాలా, అజిత్‌సింగ్, ఉమా భారతిలను కార్యకర్తలు వెనక్కు పంపడమే ఇందుకు నిదర్శనం.

ఈ పరిస్థితిని చూసే మిగతా వారు అక్కడికి వెళ్లడానికి సాహసించకుండా, తమ తమ రాష్ట్రాల్లో ఏదో ఒకటి చేసి, ప్రచారంలో వాటా కొట్టేయడానికి ప్రయత్నించారు. మరికొందరు ప్రత్యర్థులపై రాళ్లేయడానికి ఈ ఉదంతాన్ని వాడుకున్నారు. "శరద్ పవార్‌పై నేను పోరాడినప్పుడు బీజేపీ, శివసేన నా చుట్టూ తోక ఊపుకుంటూ తిరిగాయి. ఈ పార్టీలపై పోరాడితే వాటి ప్రత్యర్థులు నాకు మద్దతు ప్రకటిస్తారు. మేం చేస్తున్న పోరాటం నుంచి ఖ్యాతి పొందాలని వీరు ఎందుకు ప్రయత్నిస్తారు? ఈ ఉద్యమంలో పాల్గొనే వారికి స్వచ్ఛమైన ఆచారం, నడవడిక, వ్యవహార శైలి ఉండాలి.

నిష్కళంకులు, నీతిపరులు కావాలి'' అని హజారే స్పష్టం చేశారు. మరి... హజారేతో చేతులు కలిపే నిష్కళంక, నిర్మల, నీతిపరులైన నాయకులు మనకు ఎంతమంది ఉన్నారు? ఎక్కడిదాకానో ఎందుకు? హజారే డిమాండ్ మేరకు రూపొందనున్న లోక్‌పాల్ బిల్లును గట్టెక్కించాల్సిన ఎంపీల్లోనే 150 మందికి నేర చరిత్ర ఉంది. 72 మందిపై హత్య, అత్యాచారం వంటి తీవ్రమైన అభియోగాలున్నాయి.

"నేను కూడా అవినీతికి వ్యతిరేకంగా పోరాడతాను. మద్దతిస్తాను'' అని ఎవరికివారు ప్రకటించగానే నమ్మే కాలం ఎప్పుడో పోయింది. చేసిన తప్పులకు చెంపలేసుకుని... "అవినీతికి పాల్పడ్డాం. ఇంత సొమ్మును మెక్కేశాం. బలమైన చట్టాలు లేనందునే ఇలా కక్కుర్తి పడ్డాం. అందుకే... ఇప్పుడైనా జన్‌లోక్‌పాల్ కావాలి'' అని ఉంటే, ఈ నేతలను నిజంగా నమ్మే వాళ్లేమో! కానీ అలా అనగలిగేంత ధైర్యం వాళ్లకుందా? అది మన నేతలకు లేకపోవడం వల్లే జనం వారి వెంట నిలవడం లేదు.
మందు పోసి, డబ్బులిచ్చి, వాహనాల్లో తరలించి నానా తంటాలు పడినా... చివరికి పది మంది కూడా వారి ఉద్యమాల్లో మిగలడం లేదు. అదే ఒక బక్కపలచని, బోసి నవ్వుల వృద్ధుడు ఇచ్చిన పిలుపునకు ఈ దేశం మొత్తం కదిలింది. అంతవరకూ బాగానే ఉంది. మరి అవినీతిపై పోరాటమంటే ఎవరు ఎవరిపై పోరాడుతున్నట్టు? బరికి అవతల ఎవరున్నారు? ఇవతల ఎవరున్నారు? ఎవరిని నమ్మాలి? ఎవరిని చూసి నవ్వాలి? ఎవరికి వారు మేమున్నామంటూ ప్రవేశిస్తే... మొత్తం ఉద్యమమే పలుచనపడే ప్రమాదముంది. ఎవరిని ఎక్కడ ఉంచాలో తేల్చాల్సిన సమయం ఆసన్నమైంది. జాగో భారత్... జాగో!