Hai My dear BOOK ... how r U ...?

0


హయ్ మై డియార్ బుక్ హౌ ఆర్యూ...?
నువ్వు బానే ఉంటావులే. 'ఒక్క నువ్వే నాకు, పెక్కు నేనులు నీకు' కదా మరి. ఒక్కసారి నీ మాయలో పడితే తేరుకోగలరా ఎవరైనా? ఈమధ్య ఏమైందో తెలుసా, 'శరీరానికి వ్యాయామం అని తెగ పోరుతున్నారు కానీ బుర్రకు పుస్తకాలే కదా వ్యాయామం, దాన్నీ కాస్త అలవాటు చేసుకోమని చెప్పండి' అని ఒక డాక్టర్‌గారితో అంటే 'మేం చెప్పకముందే చదువుతున్నారు కదమ్మా - ఫేస్‌బుక్‌లో వందల కొద్దీ స్టేటస్ మెసేజ్‌లూ, జీమెయిల్లో అసంఖ్యాకంగా వచ్చిపడే ఫార్వర్డ్ మెయిల్సూ, ట్విట్టర్ సందేశాలూ..

చదివే అలవాటు కుర్రకారులో ఇప్పుడే పెరిగింది నిజానికి' అన్నాడాయన నవ్వుతూ. టీవీలొచ్చాక చదివే అలవాటు పోయిందీ పోయిందీ అని గోల పెడతారుగానీ టీవీల గోల పడలేక మళ్లీ అందరూ నీవైపే వస్తారని కూడా ఆయన జోస్యం చెప్పాడు. నాకెంత సంతోషం కలిగిందో. నిజానికి టీవీ వచ్చాకే కదా మనిద్దరి ప్రేమ మరింత గాఢమైంది! ఆ దూరదర్శన్ కార్యక్రమాలు చూడలేక, నాన్నను అడిగితే కేబుల్ పెట్టించక... అప్పుడు నువ్వేగా నాకు దిక్కు. ఇప్పుడిన్ని ఛానెళ్లు పెరిగినా వాటిని చూడలేక తలుపులేసుకుని మళ్లీ నీ ఒడిలోకే చేరుకుంటాను.

సోగయా ఏ జహా... సోగయా ఆస్‌మా.. సోగయీ హై సారీ మంజిలే.. అన్నట్టు, ప్రపంచమంతా నిద్రపోతున్నప్పుడు మనిద్దరి ఏకాంత సంభాషణలకు అంతూపొంతూ ఉంటుందా? 'నేనిక్కడుంటే నువ్వక్కడుంటే ప్రాణం విలవిల....' అని పాడుకోవాల్సిన అవసరం నీతో నాకెప్పుడూ లేదు. ఎందుకంటే నువ్వెప్పుడూ నా హ్యాండ్‌బ్యాగ్‌లోనో, దిండు పక్కనో, డైనింగ్ టేబుల్మీదో ఉంటావు కదా.

'పుస్తకాలు చదవడం కష్టం. మరీ గొప్ప పుస్తకాలయితే ఎలాగూ సినిమాలుగా వస్తాయి, అప్పుడు చూస్తే సరిపోతుందనిపిస్తుంది' అన్నారు నటుడు సుమంత్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు. ఆయనే కాదు, చాలామంది అలానే అనుకుంటారని తర్వాత కొందరితో మాట్లాడాక అర్థమయింది. 'నాతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్' అని గిరీశం అన్నట్టుగా 'పుస్తకాలు చదవకపోవడమే మంచిది తెలుసా' అన్నట్టు కొందరు పోజు కొడుతుంటారు. వాళ్లలో మొట్టమొదటి వాడు మా తమ్ముడే. 'ఎందుకే అన్నన్ని పుస్తకాలు చదివి భూమికి అపకారం చేస్తుంటావు? జర్నలిస్టువైనా నీకు పర్యావరణ స్పృహ బొత్తిగా లేదు...'

అని వాడు విసుక్కున్నప్పుడు నేను ఆశ్చర్యమూ ప్లస్ ప్రశ్నలతో గిజగిజలాడేను. నా పుస్తక ప్రియత్వం పర్యావరణానికి హాని చెయ్యడమేమిటీ, ఇదేదో మోకాలుకూ బోడిగుండుకూ లంకెలా ఉందనిపించింది. 'నాకన్నా తెలివైనదానివని స్కూలు రోజుల్నుంచీ నీకు పేరుండటం వల్ల కళ్లు నెత్తికెక్కి నా జ్ఞానాన్ని నువ్వు గుర్తించడం లేదు గానీ, అసలు విషయం ఏమిటంటే ఇన్నేసి పుస్తకాలు అచ్చు వెయ్యడానికి కాగితం కావాలా.... కాగితాలు కలపగుజ్జు నుంచి తయారవుతాయని చదువుకున్నామా లేదా... అన్ని చెట్లు నరికి తయారుచేసిన పుస్తకాలను చదవడమంటే పర్యావరణానికి ఎంత హాని చేసినట్టు నువ్వు? ఇప్పటికైనా ఆ బుకిష్ నాలెడ్జిని పక్కకు పెట్టి జనరల్ నాలెడ్జిని పెంచుకో.

దానికోసమంటూ మళ్లీ పుస్తకాలు కొనకేం. అదే నువ్వు భూమాతకు చేసే మేలు. అంత పచ్చదనాన్ని పెరగనిచ్చే నాలాంటివాళ్లేనమ్మా...' అని వాడు లెక్చరిచ్చాక 'ఓర్నాయినా ఇదెక్కడి తగువు... చదవకుండా కూడా ఊరికి ఉపకారం చేసేవాళ్లుంటార్రా దేవుడా' అనుకున్నాను. క్లాసు పుస్తకాలు కాకుండా వాడు చదివినవి రెండే రెండు పుస్తకాలు. ఒకటి 'ఒక యోగి ఆత్మకథ'. రెండు 'గంధపుచెక్కల దొంగ వీరప్పన్ ఆత్మకథ'.

ఈ రెండిటి నుంచి వాడి సైకాలజీనేమైనా పట్టుకుందామని ప్రయత్నించేను కానీ 'తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము పట్టవచ్చు'ననే పద్యం గుర్తొచ్చి మానుకున్నాను. పట్టుపురుగులను చంపి తయారుచేసే పట్టుచీరలను అసహ్యించుకున్నట్టే చెట్లు నరికి తయారుచేసే పుస్తకాలను అసహ్యించుకునే మా తమ్ముడు ఈమధ్య 'కిండిల్' అనే ఎలక్ట్రానిక్ పరికరాన్ని మాత్రం మహదానందంగా కొని అమెరికా నుంచి నాకు బహుమతిగా పంపేడు. 'ఇందులో నీక్కావలసినన్ని పుస్తకాలు పడతాయి, హాయిగా చదువుకో. బైట పుస్తకాలు కొనకేం' అన్నాడు. 'మరి ప్రపంచవ్యాప్తంగా పేరుకుపోతున్న ఎలక్ట్రానిక్ చెత్త సంగతేంట్రా' అని తెలివిగా అడిగేలోపే వాడు ఫోను పెట్టేశాడు.

ఒకసారి అలవాటయిన వ్యసనం నుంచి ఎవరైనా బైట పడతారా? వాడి పిచ్చిగానీ. అసలు మన ప్రేమాయణాన్ని మొగ్గలోనే తుంచెయ్యడానికి ఎన్ని ప్రయత్నాలు జరగలేదు చెప్పు? మా ఇంటిల్లిపాదీ ఏకమై ఎదిరించినా సరే, ఏమండీ పుస్తకంగారూ, ఐ లవ్యూ. అంతే. 'మేరా దిల్‌థా అకేలా... తూనే ఖేల్ ఏసా ఖేలా... తేరీ యాద్ మే జాగూ రాత్ భర్... తూ హై బడా జాదూగర్...' మై డియర్ బుక్, ఈ ప్రేమమైకాన్ని ఇలాగే ఉంచుతావు కదూ!
- అరుణ పప్పు


నచ్చితే నలుగురికి చెప్పండి...నచ్చక పొతే వదిలి పడేయండి ....!